-->

సింగరేణి కాలుష్యం నేపథ్యంలో యువతి బ్లెస్సి మృతి

సింగరేణి కాలుష్యం నేపథ్యంలో యువతి బ్లెస్సి మృతి… అంబేద్కర్ నగర్ కాలనీవాసుల్లో ఆందోళన


సత్తుపల్లి: సింగరేణి పరిశ్రమల కాలుష్యం మళ్లీ ప్రాణం తీసింది. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన నక్క మోషే–సుజాత దంపతుల కుమార్తె నక్క బ్లెస్సి (18) శనివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. శరీరంలోని అంతర్గత అవయవాలకు ఇన్ఫెక్షన్ తీవ్రంగా పెరగడం వల్ల ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

బ్లెస్సి సత్తుపల్లి లోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. చలాకీగా, ఆరోగ్యంగా ఉన్న ఆమె వారం రోజుల క్రితం ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. మలమూత్ర విసర్జన ఆగిపోవడంతో బంధువులు ఆమెను తొలుత పాల్వంచలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేక యువతి మృతి చెందింది.

కాలుష్య సమస్యతో వరుస మరణాలు – కాలనీవాసుల ఆవేదన

బ్లెస్సి మరణంతో అంబేద్కర్ నగర్ కాలనీలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. గత కొంతకాలంగా యువకులు, యువతులు వరుసగా ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళనకు గురి చేస్తోందని స్థానికులు తెలిపారు.
సింగరేణి షైలో బంకర్‌ వ్యర్థాల కారణంగా వాయు, నీటి కాలుష్యం తీవ్రమైప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శించారు.

కాలుష్య ప్రభావంపై అవగాహన కల్పిస్తూ, పునరావాసం కోరుతూ 35 రోజులపాటు భారీ నిరసనలు చేసినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించలేదని వేయి మాటలు వేశారు. “బతికే హక్కు కూడా కోల్పోతున్నాం… కాలుష్య గాలి పీలుస్తూ, కలుషిత నీరు తాగుతూ వరుసగా మృతి చెందుతున్నారు. ఇక ప్రభుత్వం పట్టించుకోకపోతే పరిస్థితి మరింత దారుణం అవుతుంది” అని కాలనీవాసులు ఆవేదనపడ్డారు.

తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

  • కాలుష్య తీవ్రతపై సమగ్ర పరీక్షలు చేయాలి
  • త్రాగునీరు, వాయు నాణ్యతపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి
  • కాలనీలో జరుగుతున్న వరుస మరణాలకు కారణాలపై దర్యాప్తు చేయాలి
  • సింగరేణి వ్యర్థాల ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు పునరావాసం కల్పించాలి

యువతి బ్లెస్సి మరణం మరోసారి అంబేద్కర్ నగర్ కాలనీలోని కాలుష్య పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. ప్రభుత్వం స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793