ముహూర్తం ఖరారు..? సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్‌కు మార్గం సుగమం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం అధికార వర్గాలకు ఊహించని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. ఈ విజయాన్ని పునాదిగా చేసుకుని, ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో తమ ప్రభావాన్ని మరింత పెంచుకోవడానికి ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అవకాశంగా చూస్తోంది.
ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ముఖ్య నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. సర్పంచ్, ఎంవో, జడ్‌పీటీసీ, ఎంపీటీసీతో పాటు పురపాలక స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పై చర్చ జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం — ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను కలిపి మొత్తం 50 శాతం మించకూడదు. ఈ నేపథ్యంలో, మొత్తం 50 శాతం పరిమితిలోనే బీసీలకు రిజర్వేషన్లు కేటాయించే విదానాన్ని అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం.
భవిష్యత్తులో బీసీ వర్గాలకు మరింత న్యాయం చేసేందుకు ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను ప్రజల్లో విస్తృతంగా చర్చించడంతో పాటు, ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశంగా మలచే ఆలోచన కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా ఉన్నట్లు ఉన్నత వర్గాలు చెబుతున్నాయి.
ఇక, ఆరు గ్యారంటీ పథకాల అమలుకు స్థానిక సంస్థల సహకారం కీలకమని, ఎన్నికల అనంతరం వాటి అమలు మరింత వేగం పుంజుకుంటుందనే అంచనాను అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంతో కొత్త ఉత్సాహాన్ని అందుకున్న కాంగ్రెస్, ఈ ఊపును స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొనసాగించాలని వ్యూహరచన చేస్తోంది. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

Post a Comment