రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమం
అమరావతి, డిసెంబర్ 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదేళ్లలోపు వయసున్న 54,07,663 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 38,267 పోలియో బూత్‌లను ఏర్పాటు చేయగా, 61.26 లక్షల డోస్‌ల పోలియో టీకాలను అన్ని జిల్లాలకు పంపించినట్లు మంత్రి తెలిపారు.
రవాణా కేంద్రాలు, జనసమూహ ప్రాంతాల్లో ప్రత్యేక బూత్‌లు
బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మేళాలు, బజార్లు, పర్యాటక ప్రాంతాల్లో 1,140 ప్రత్యేక బూత్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలియో దినోత్సవం అయిన 21న బూత్‌ల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.
ఇంటింటి సర్వే ద్వారా పోలియో చుక్కలు
21వ తేదీన ఏవైనా కారణాలతో పోలియో చుక్కలు వేయించుకోలేని పిల్లల కోసం 22, 23 తేదీల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఇందుకోసం 76,534 బృందాలు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తాయని వివరించారు.
భారీ సంఖ్యలో సిబ్బంది, మొబైల్ బృందాలు
ఈ కార్యక్రమంలో
- 1,704 మంది వైద్యాధికారులు,
- 39,494 మంది ఇతర సిబ్బంది,
- 4,206 మంది పర్యవేక్షకులు పాల్గొననున్నారు.
వలస కార్మికులు, సంచార జాతులు, నిర్మాణ స్థలాలు, ఇటుక బట్టీలు వంటి ప్రాంతాలను కవర్ చేయడానికి 1,854 మొబైల్ బృందాలు పనిచేస్తాయని మంత్రి తెలిపారు.
ప్రతి మొబైల్ బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్‌తో పాటు ఇద్దరు సిబ్బంది ఉంటారని చెప్పారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన ఆసుపత్రులు, మేళాలు, బజార్లలో 21, 22, 23 తేదీల్లో ప్రత్యేక బృందాలు పర్యటిస్తాయని మంత్రి స్పష్టం చేశారు.

Post a Comment