పసి పిల్లాడి ప్రాణం తీసిన పెన్సిల్ – ఖమ్మం జిల్లాలో విషాద ఘటన
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ ప్రైవేటు పాఠశాలలో యుకేజీ చదువుతున్న విహార్ (6) అనే పసి బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు.
వివరాల ప్రకారం.. పాఠశాలలో విరామ సమయంలో విహార్ మూత్రశాలకు వెళ్లి తిరిగి తన తరగతి గదికి పరిగెడుతూ వస్తున్నాడు. ఆ సమయంలో కిందపడిపోవడంతో, అతని చేతిలో ఉన్న పెన్సిల్ గొంతులోకి గుచ్చుకుంది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడగా, అక్కడికక్కడే అపస్మారక స్థితికి చేరాడు.
పాఠశాల సిబ్బంది వెంటనే బాలుడిని సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించగా, గ్రామమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యం ఉందా? భద్రతా చర్యలు పాటించారా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చిన్నారుల భద్రతపై పాఠశాలలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పిల్లల చేతిలో ప్రమాదకర వస్తువులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Post a Comment