-->

రేపే రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసిన అధికారులు

రేపే రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసిన అధికారులు


హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగియడంతో, ఎన్నికల అధికారులు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం జరగనున్న ఈ విడత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,332 గ్రామ పంచాయతీలు, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.

ఈ దశలో ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,304 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 3,911 సర్పంచ్ స్థానాలకు ఈనెల 14న పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు సంబంధించి 28,278 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్

పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

తొలి విడత ఫలితాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ ఇటీవల ముగిసిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తొలి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,600కు పైగా వార్డులకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

కౌంటింగ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు భారీ ఆధిక్యం ప్రదర్శించారు. కాంగ్రెస్ మద్దతు పొందిన అభ్యర్థులు 2,872 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతుదారులు 1,160 స్థానాల్లో మాత్రమే గెలుపొందారు.

బీజేపీ మద్దతుదారులు కేవలం 195 స్థానాలకు పరిమితమయ్యారు. అలాగే 460 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

కౌంటింగ్ సమయంలో కట్టుదిట్టమైన భద్రత తొలి విడత కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి నిరాకరించారు.

రెండో విడతపై అందరి దృష్టి తొలి విడత ఫలితాల ప్రభావంతో రెండో విడత పోలింగ్‌పై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇక మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈనెల 17న జరగనుంది.
Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793