-->

సర్పంచ్ ఎన్నికల్లో తల్లిపై కూతురు ఘనవిజయం!

సర్పంచ్ ఎన్నికల్లో తల్లిపై కూతురు ఘనవిజయం!


జగిత్యాల జిల్లా : డిసెంబర్ 11: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని తిమ్మయ్యపల్లె సర్పంచ్ ఎన్నికల్లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. తల్లి–కూతురు ఒకే పదవికి పోటీ పడగా, కూతురు 91 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించింది.

తిమ్మయ్యపల్లె సర్పంచ్ పదవి ఈసారి బీసీ మహిళలకు రిజర్వ్ కావడంతో, తల్లి శివరాత్రి గంగవ్వ పోటీకి దిగారు. కానీ అనూహ్యంగా ఆమెకే పోటీగా కూతురు సుమలత నామినేషన్ దాఖలు చేసింది.

తల్లికి బీఆర్ఎస్​ మద్దతు లభించగా, కూతురుకు ఆధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. గ్రామంలో గత కొంతకాలంగా తల్లి–కూతుళ్ల కుటుంబాల మధ్య వ్యక్తిగత విభేదాలు ఉండటం, సుమలత అదే గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో కుటుంబాల్లో గ్యాప్ ఏర్పడటం రాజకీయ రంగులో మరింత హల్‌చల్‌గా మారింది.

తల్లి–కూతురు ఇద్దరూ తలపడ్డ ప్రచారం గ్రామంలో చర్చనీయాంశమైంది. ఇంటింటికీ తిరుగుతూ ఇద్దరూ ఓటర్లను ఆకర్షించడానికి శక్తివంచన లేకుండా శ్రమించారు.

చివరకు ఇవాళ వెలువడిన ఫలితాల్లో, కూతురు సుమలత 91 ఓట్ల భారీ మెజారిటీతో తల్లిపై విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామంలో ఈ ఫలితం హాట్‌టాపిక్‌గా మారింది.

Blogger ఆధారితం.