ఎస్సీలు, స్థానికులపై వివక్ష చూపుతున్న ఓబీ సౌదా కంపెనీ యాజమాన్యం
కొత్తగూడెం | డిసెంబర్ 28: కొత్తగూడెం సింగరేణి రుద్రంపూర్ ఓపెన్‌కాస్ట్‌లో ఓబీ పనులు చేస్తున్న సౌదా కంపెనీ యాజమాన్యం ఎస్సీ కార్మికులపై వివక్ష చూపుతోందని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (టీఎంఆర్పీఎస్) నాయకులు ఆరోపించారు.
గత కొన్ని నెలలుగా 30 మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి కాలం గడుపుతూ, చివరకు ఎస్సీలకు ఉద్యోగాలు నిరాకరిస్తున్నారని వారు తెలిపారు. గతంలో ఏఎంఆర్‌ఏబీ, మహాలక్ష్మి తదితర కంపెనీల్లో పనిచేసిన ఎస్సీ కార్మికులమైన మేము, సౌదా కంపెనీ వచ్చాక కూడా ఉద్యోగాలు ఇవ్వాలని అప్పటి మేనేజర్ కిషోర్‌కు వినతిపత్రం అందజేశామని చెప్పారు. అప్పట్లో 15 మందికి వెంటనే, మిగతా వారికి రెండో కంపెనీ ప్రారంభమైన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ప్రభావిత ప్రాంతమైన రుద్రంపూర్‌కు చెందిన రిటైర్డ్ కార్మికుల పిల్లలమైన మాకు, మాదిగ–మాల వర్గాలకు చెందినవారమనే కారణంతోనే ఉద్యోగాలు ఇవ్వడం లేదని టీఎంఆర్పీఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సౌదా కంపెనీ మేనేజర్ కామేష్ వర్మపై సింగరేణి యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాలని, అర్హులైన ఎస్సీ కార్మికులందరికీ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎస్సీలకు ఉద్యోగాలు కల్పించే వరకు ఉద్యమం ఆగదని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా రమేష్ సూదిగలి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో శంకువార్ ప్రశాంత్, గుండా శ్రీనివాస్, తాసంగం కిషోర్, కడేటి సురేష్, కర్రీ సరీష్, కర్రీ ఉదయ్, నాగంటి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment