బ్యాలెట్ పేపర్లు బహిర్గతం ఘటన: ఎనిమిది మంది పీవోల సస్పెన్షన్
నల్లగొండ | డిసెంబర్ 14 | నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో మురుగు కాలువలో బ్యాలెట్ పేపర్లు బహిర్గతం అయిన ఘటనపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించిన ఎనిమిది మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పీవోలు)ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఘటనపై చిట్యాల ఎంపీడీవో ఎస్.పి. జయలక్ష్మి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆర్డీవో అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎండీవో, ఆర్వోతో పాటు ఇతర అధికారుల సమక్షంలో విచారణ నిర్వహించారు.
విచారణలో పోలింగ్ సమయంలో పడిన ఓట్లు, కౌంటింగ్ సమయంలో లెక్కించిన ఓట్లు పూర్తిగా సరిపోలినట్లు అధికారులు నిర్ధారించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యాక, గెలిచిన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన అనంతరమే ఈ ఘటన చోటు చేసుకుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
అయితే, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంటూ, బాధ్యతాయుతంగా వ్యవహరించలేదన్న కారణంతో ఎనిమిది మంది పీవోలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కలెక్టర్ తెలిపారు.

Post a Comment