అనుమానంతో ప్రియురాలిపై దారుణ హత్య — భైంసాలో షాకింగ్ ఘటన
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ప్రేమ అనుమానాలు ప్రాణాంతకంగా మారిన దారుణ సంఘటన చోటుచేసుకుంది. సంతోషిమాత ఆలయం సమీపంలోని నందన టీ పాయింట్ వద్ద జరిగిన ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది.
ప్రియుడి కత్తిప్రహారాలకు అశ్విని మృతి
భైంసాకు చెందిన అశ్విని (27) రెండేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుని, నగేష్ అనే యువకుడితో ప్రేమలో పడి అతనితో కలిసి జీవిస్తోంది. అశ్విని ఉపాధి పొందేందుకు సాయం చేస్తూ నగేష్ స్వయంగా ఆమెకు టీ స్టాల్ ఏర్పాటు చేశాడు.
అయితే ఇటీవల టీ స్టాల్‌కు తరచూ వచ్చే మరొక యువకుడితో అశ్విని చనువుగా మాట్లాడుతుండడాన్ని నగేష్ సహించలేకపోయాడు. ఈ అనుమానాల నేపథ్యంలో ఇద్దరి మధ్య తగాదాలు పెరిగాయి. ఆగ్రహానికి లోనైన నగేష్, ఈరోజు అకస్మాత్తుగా కత్తితో దాడి చేసి అశ్వినిని అక్కడికక్కడే హతమార్చాడు.
రక్తపు మడుగులో మృతదేహం పక్కనే కూర్చున్న నిందితుడు
దారుణ హత్య అనంతరం అశ్విని రక్తపు మడుగులో పడి ఉండగా, ఆమె మృతదేహం పక్కనే నగేష్ కూర్చొని ఉండటం చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు.
నిందితుడు అదుపులో
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నగేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. హత్యకు కారణమైన అనుమానాలు, వ్యక్తిగత తగాదాల కోణంలో విచారణ కొనసాగుతోంది.
ఈ సంఘటనతో భైంసా పట్టణంలో తీవ్ర కలకలం రేగింది. స్థానికులు ప్రేమ అనుమానాలు ఇంకో యువతి ప్రాణం తీసుకురావడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment