నూతన సంవత్సర వేడుకలు చట్టబద్ధంగా జరుపుకోవాలి
రామగుండం, డిసెంబర్ 30: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేడుకలు ఆనందంగా కానీ చట్టానికి లోబడి జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన హెచ్చరించారు.
డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10.00 గంటల నుంచి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేయడం, జరిమానాలు విధించడం, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం, బైండ్‌ఓవర్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో జరగేలా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతోందన్నారు. స్థానిక పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, షీ టీమ్స్, మఫ్టీ టీమ్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్, పికెట్స్, వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తామని తెలిపారు.
నూతన సంవత్సర వేడుకలను అర్థరాత్రి 12.30 గంటల లోపు ముగించుకోవాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ముందస్తు పోలీసు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని, అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వేడుకల ప్రాంగణంలో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది ఏర్పాటు తప్పనిసరి అని పేర్కొన్నారు.
ఆర్కెస్ట్రాలు, డీజేలు, మైకుల వినియోగం, బాణసంచా పూర్తిగా నిషేధించబడిందని తెలిపారు. మద్యం దుకాణాలు, వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు ప్రభుత్వ అనుమతించిన సమయాలను కచ్చితంగా పాటించాలన్నారు.
ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా యువతపై కేసులు నమోదైతే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశీ వీసాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నిషేధిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని, కుటుంబ సమేతంగా ఇళ్లలోనే సంతోషంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా విజ్ఞప్తి చేశారు.

Post a Comment