ఇంటి యజమానిని హత్య చేసి గోదావరిలో పడేసిన అద్దెకున్న యువకులు!
హైదరాబాద్, డిసెంబర్ 30: హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. మల్లాపూర్ – బాబానగర్ పరిధిలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళను ఆమె ఇంట్లో అద్దెకు ఉంటున్న యువకులే హత్య చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సుజాత (65) అనే మహిళ తన ఇంట్లో ముగ్గురు క్యాబ్ డ్రైవర్లకు అద్దెకు గదులు ఇచ్చింది. ఈ క్రమంలో కోనసీమ జిల్లా పేరవలి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎం. అంజిబాబు (33) ఈ నెల 19 నుంచి కనిపించకుండా పోవడంతో అనుమానం వ్యక్తమైన సుజాత సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే సమయంలో సుజాత కూడా కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సుజాత కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు పలురోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. విచారణలో భాగంగా అంజిబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం కోసం సుజాతను హత్య చేసినట్లు అంజిబాబు అంగీకరించాడు. తన స్నేహితులు యువరాజు (18), దుర్గారావు (35) సహకారంతో హత్య అనంతరం మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో పెట్టి కార్ డిక్కీలో తరలించి కోనసీమ జిల్లా కృష్ణలంక వద్ద గోదావరి నదిలో పడేశామని తెలిపాడు.
నిందితుల సూచనల మేరకు పోలీసులు గోదావరిలో గాలింపు చేపట్టి ట్రాలీ బ్యాగ్‌లో ఉన్న సుజాత మృతదేహాన్ని గుర్తించారు. ప్రధాన నిందితుడు అంజిబాబు సహా అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు.
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసులు, నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Post a Comment