-->

బస్సులో మంటలు.. ముగ్గురు మృతి 36 మంది ప్రాణాలు కాపాడిన డీసీఎం డ్రైవర్

బస్సులో మంటలు.. ముగ్గురు మృతి 36 మంది ప్రాణాలు కాపాడిన డీసీఎం డ్రైవర్


నంద్యాల జిల్లా | జనవరి 22: నంద్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శిరివెళ్లమెట్ట సమీపంలో నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఏఆర్‌బీసీవీఆర్‌ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పేలి అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉండగా, టైరు ఒక్కసారిగా పేలడంతో వాహనం నియంత్రణ తప్పింది. లారీని ఢీకొట్టిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌, లారీ డ్రైవర్‌, క్లీనర్‌ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

అయితే ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళ్తున్న ఓ డీసీఎం వాహన డ్రైవర్ అప్రమత్తంగా స్పందించాడు. తన వాహనాన్ని ఆపి, మంటలు ఎగిసిపడుతున్న బస్సు అద్దాలను పగులగొట్టి ప్రయాణికులను బయటకు రావాలని సూచించాడు. దీంతో ప్రయాణికులు కిటికీల ద్వారా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ క్రమంలో పదిమందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

మంటలు తీవ్రతరం కావడంతో కంటైనర్ లారీ పూర్తిగా దగ్ధమైంది. మృతదేహాలు మంటల్లో కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. అలాగే ప్రమాదంలో ప్రయాణికుల లగేజీ మొత్తం కాలి బూడిదైపోయింది.

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గతేడాది కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఈ ప్రమాదం గుర్తుకు తెస్తోంది. అప్పటిలాగే ఈసారి కూడా డీసీఎం డ్రైవర్ సకాలంలో స్పందించడంతో 36 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాలను కాపాడిన ఆ డ్రైవర్‌ను స్థానికులు ‘రియల్ హీరో’గా కొనియాడుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793