-->

మేడారం మహా జాతరకు ఏర్పాట్లు పూర్తి కోటి మంది భక్తుల రాకకు సర్వం సిద్ధం

మేడారం మహా జాతరకు ఏర్పాట్లు పూర్తి కోటి మంది భక్తుల రాకకు సర్వం సిద్ధం


ములుగు జిల్లా, జనవరి 24: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న ఈ మహా జాతరకు సుమారు కోటి మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ ప్రదేశాలు, ప్రయాణ ప్రాంగణాలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, భద్రత, రద్దీ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన ఈ జాతరకు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుండగా, కొందరు నెల రోజుల ముందే గద్దెల వద్ద మొక్కులు చెల్లిస్తున్నారు.

13 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు

జాతర సందర్భంగా శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తూ 25 మంది ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో 13 వేల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, వరంగల్ పోలీస్ కమిషనర్, రామగుండం సీపీ పర్యవేక్షణలో గద్దెలు, ట్రాఫిక్ నియంత్రణ, జాతర కోర్ ఏరియాలో భక్తుల రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

డ్రోన్లు, సీసీ కెమెరాలు, కృత్రిమ మేధ వినియోగం

ఈ ఏడాది జాతరలో సాంకేతికతకు పెద్దపీట వేయడం గమనార్హం. పాత నేరస్థుల సంచారం, తప్పిపోయిన వారి గుర్తింపు, రద్దీ, ట్రాఫిక్ సమస్యలను గుర్తించేందుకు కృత్రిమ మేధ (AI) సాయంతో పర్యవేక్షణ కొనసాగుతోంది.
జాతర ప్రాంతమంతా 20 డ్రోన్ కెమెరాలు, 450 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.

గతంలో ఒకేసారి 2 వేల మంది మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉండగా, ప్రాంగణం విస్తరణతో ఇప్పుడు ఒకేసారి 8–9 వేల మంది భక్తులు దర్శనం చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. పునర్నిర్మాణంతో అన్ని గద్దెలు ఒకే వరుసలోకి రావడంతో భక్తుల రాకపోకలు సులభమయ్యాయి.

పార్కింగ్, బస్సులు, ఉచిత ప్రయాణం

భక్తుల రద్దీకి అనుగుణంగా ఊరట్టం గ్రామం వద్ద 33 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. సుమారు 3 లక్షల వాహనాలు నిలిపేలా 2 వేల ఎకరాల స్థలం సిద్ధం చేశారు.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి 500 అదనపు ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. మహిళలకు ఆధార్ గుర్తింపుతో ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగనుంది. గద్దెలకు సమీపంలో ఆర్టీసీ బస్టాండ్, వీఐపీ వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

రోడ్లు, విద్యుత్తు, కమ్యూనికేషన్ సదుపాయాలు

మేడారం చేరుకునే మార్గాల్లో 39 చోట్ల రహదారుల అభివృద్ధి, తాడ్వాయి, పస్రా, బయ్యక్కపేట మార్గాల్లో ఇరుకు రోడ్ల విస్తరణ చేపట్టారు. మేడారం ప్రాంతంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించారు.
జంపన్నవాగును ఆధునికీకరించడంతో పాటు విద్యుత్తు సరఫరాకు రెండు 33/11 కేవీ సబ్‌స్టేషన్ల సామర్థ్యం పెంచి, నార్లాపూర్ వద్ద కొత్త సబ్‌స్టేషన్ నిర్మించారు. మొత్తం 259 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు.

మొబైల్ సిగ్నల్ సమస్య తలెత్తకుండా బీఎస్‌ఎన్‌ఎల్ 10 తాత్కాలిక టవర్లు ఏర్పాటు చేసింది.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793