తీవ్ర విషాదం.. అరగంట వ్యవధిలో తండ్రీకొడుకులు మృతి
పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగెపల్లి గ్రామంలో గురువారం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. అరగంట వ్యవధిలోనే తండ్రీకొడుకులు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
నాగెపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రాజేశం (60) గత కొంతకాలంగా పక్షవాతం కారణంగా మంచానికే పరిమితమై ఉండగా, గురువారం ఉదయం ఆయన స్వగృహంలో మృతి చెందారు. ఈ విషాద వార్త ఇంకా కుటుంబ సభ్యులు జీర్ణించుకోకముందే మరో దుర్ఘటన చోటుచేసుకుంది.
రాజేశం కుమారుడు ఎరుకల శ్రీకాంత్ (37) అనారోగ్యంతో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, తండ్రి మరణించిన అరగంటలోనే తుదిశ్వాస విడిచారు. ఒకే సమయంలో తండ్రీకొడుకులను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ సంఘటనతో నాగెపల్లి గ్రామం మొత్తం శోకసంద్రంగా మారింది. గ్రామస్తులు కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Post a Comment