కొండెక్కిన కోడి..! చికెన్ ప్రియులకు న్యూ ఇయర్ షాక్
హైదరాబాద్, జనవరి 05: పండుగలొచ్చినా, ఆదివారం వచ్చినా పేద–మధ్యతరగతి కుటుంబాల వంటింట్లో తప్పనిసరిగా కనిపించే చికెన్ కూర ఇప్పుడు అందుబాటుకు దూరమవుతోంది. కొత్త సంవత్సర ఆరంభంలోనే కోడి మాంసం ధరలు అమాంతం పెరిగి చికెన్ ప్రియులకు షాక్ ఇచ్చాయి.
గత కొన్ని రోజుల వరకు కేజీ చికెన్ ధర రూ.200 నుంచి రూ.250 మధ్య ఉండగా, ఒక్కసారిగా పెరిగి ప్రస్తుతం మార్కెట్‌లో రూ.300 వరకు పలుకుతోంది. దీంతో చికెన్ కొనాలంటే జేబుకు చిల్లులు పడుతున్నాయి. కోడి మాంసంతో పాటు గుడ్ల ధరలు కూడా పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్క గుడ్డు ధర రూ.8గా ఉంది.
బహిరంగ మార్కెట్‌లో బ్రాయిలర్ చికెన్ కేజీ ధర రూ.300గా ఉండగా, లైవ్ కోడి ధర కేజీకి రూ.170గా ఉంది. ఫారం కోడి మాంసం రూ.180గా, బండ కోడి మాంసం ధర రూ.280 వరకు పలుకుతోంది.
ఏపీలోని పాయకరావుపేట, నక్కపల్లి ప్రాంతాల్లో సుమారు 450 వరకు కోళ్ల పారాలు ఉండగా, రోజుకు దాదాపు 20 లక్షల కోళ్లు మార్కెట్‌కు సరఫరా అవుతున్నాయి. ఇవి కేవలం జిల్లా అవసరాలకే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ధరలు ఇంత స్థాయిలో పెరగడం గమనార్హం.
బర్డ్‌ఫ్లూ సమయంలో కోళ్ల ధరలు భారీగా పడిపోవడంతో, అప్పట్లో ప్రభుత్వ సహకారంతో పౌల్ట్రీ యాజమాన్యాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. దీంతో మళ్లీ వినియోగం పెరిగి చికెన్ ధర రూ.285 వరకు చేరింది. అనంతరం డిసెంబర్ నెలలో రూ.240–250 మధ్య స్థిరంగా కొనసాగింది.
అయితే డిసెంబర్ చివరి వారం నుంచి ఈ ఏడాది మొదటి వారం మధ్యలో చికెన్ ధర ఒక్కసారిగా పెరిగి రూ.300కు చేరింది. దీనికి రాబోయే సంక్రాంతి పండుగతో పాటు, తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలే ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
గ్రామాల్లో దావత్‌ల జోరు కొనసాగడంతో చికెన్ వినియోగం భారీగా పెరిగింది. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులు ఇంటింటికి కిలో చికెన్ ఉచితంగా పంపిణీ చేయడంతో డిమాండ్ మరింత పెరిగింది. ఫలితంగా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ల నిల్వలు తగ్గిపోయాయి.
ఈ పరిస్థితి కొనసాగితే మరో కొన్ని రోజుల్లో చికెన్ ధరలు రూ.400 వరకు చేరే అవకాశముందని చికెన్ షాప్ యజమానులు హెచ్చరిస్తున్నారు.

Post a Comment