షాపులున్నాయి.. షాపుకీపర్లు లేరు తాళాల్లేని ఇళ్లు.. నమ్మకమే నడిపే నాగాలాండ్ ఖోనోమా గ్రామం
కోహిమా: ఈ రోజుల్లో నగరాల్లో తాళాలు, సీసీ కెమెరాలు, భద్రతా గార్డులు లేకుండా జీవితం ఊహించలేం. కానీ నాగాలాండ్ రాష్ట్రంలో ఉన్న ఒక గ్రామంలో మాత్రం ఇవేవీ అవసరం లేదు. అక్కడి ప్రజల జీవితం మొత్తం నమ్మకం మీదే నడుస్తోంది. అదే గ్రామం – ఖోనోమా (Khonoma).
నాగాలాండ్ రాజధాని కోహిమాకు సమీపంలో ఉన్న ఈ గ్రామం ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేక జీవన విధానంతో గుర్తింపు పొందింది. సుమారు 1900 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో అంగామీ (Angami) గిరిజనులు నివసిస్తున్నారు. ఇక్కడ దుకాణాలు ఉంటాయి కానీ షాపుకీపర్లు ఉండరు. ప్రతి వస్తువుపై ధర రాసి ఉంటుంది. కొనుగోలుదారులు తమకు కావాల్సిన వస్తువులు తీసుకుని, ఆ ధరకు తగిన డబ్బును అక్కడే ఉంచి వెళ్లిపోతారు. ఎవరూ చూడటం లేదన్న ఉద్దేశంతో మోసం చేయడం ఇక్కడ జరగదు.
తాళాల్లేని ఇళ్లు.. తీరని నమ్మకం
ఖోనోమా గ్రామంలో కేవలం దుకాణాలే కాదు.. చాలా ఇళ్లకు కూడా తాళాలు ఉండవు. ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం ఉండటమే ఇందుకు కారణం. దొంగతనాలు, మోసాలు లేని జీవితం ఇక్కడ సాధారణం. ఈ ప్రత్యేకతను చూసి పర్యాటకులు ఆశ్చర్యానికి గురవుతుంటారు.
కమ్యూనిటీ లైబ్రరీ ప్రత్యేక ఆకర్షణ
ఈ గ్రామంలో ఒక కమ్యూనిటీ లైబ్రరీ కూడా ఉంది. ఎవరికి నచ్చిన పుస్తకాన్ని వారు తీసుకెళ్లి చదువుకోవచ్చు. చదివిన తర్వాత తిరిగి అక్కడే పెట్టవచ్చు లేదా కొత్త పుస్తకాలను విరాళంగా అందించవచ్చు. దీనివల్ల జ్ఞానాన్ని పంచుకోవాలనే భావన గ్రామస్థుల్లో బలంగా కనిపిస్తుంది.
భారతదేశపు తొలి ‘గ్రీన్ విలేజ్’
ఖోనోమాకు మరో గొప్ప గుర్తింపు కూడా ఉంది. ఇది భారతదేశంలోనే తొలి గ్రీన్ విలేజ్. 1998లో ఇక్కడ వేటను పూర్తిగా నిషేధించారు. ఒకప్పుడు వేట ప్రధాన వృత్తిగా ఉన్న అంగామీ గిరిజనులు, పర్యావరణ పరిరక్షణ కోసం ఆ సంప్రదాయాన్ని త్యాగం చేశారు. ప్రస్తుతం వ్యవసాయం, పశుపోషణ, అటవీ వనరుల ఆధారంగా జీవిస్తున్నారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం, నీటి రీసైక్లింగ్ వంటి పర్యావరణహిత చర్యలు ఇక్కడ అమల్లో ఉన్నాయి. ఖోనోమాలో అమలు చేస్తున్న నీటి రీసైక్లింగ్ విధానాన్ని నాసా శాస్త్రవేత్తలు కూడా ప్రశంసించారని గ్రామస్తులు చెబుతున్నారు.
చరిత్రతో పాటు పర్యాటక ఆకర్షణ
ఖోనోమాకు ఘనమైన చరిత్ర కూడా ఉంది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులతో ఈ గ్రామం వీరోచితంగా పోరాడింది. నేడు ఆ చరిత్రకు గుర్తుగా ఉన్న కోట, చుట్టూ విస్తరించిన ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
కాలుష్యం, ట్రాఫిక్, నేరాల భయంతో మహానగరాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ కాలంలో.. ఖోనోమా గ్రామం మాత్రం ప్రశాంత జీవనానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రకృతి ఒడిలో ఉంటూనే, ఆధునిక ప్రపంచానికి నైతిక విలువలు, నిజాయితీ పాఠాలు నేర్పుతున్న ఈ గ్రామం నిజంగా దేశానికి గర్వకారణం.

Post a Comment