బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 18 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సామర్లకోట మండలం పరిధిలోని వేట్లపాలెం గ్రామంలో శనివారం మధ్యాహ్నం బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ శబ్దంతో పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడు శబ్దం దాదాపు కిలోమీటరు దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు.
18 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో 18 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిధ్రమైనట్టు సమాచారం. మరో 20 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గాయపడిన వారిని వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
సహాయక చర్యలు ముమ్మరం
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని గ్రామస్తులు చెబుతున్నారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కుటుంబ సభ్యుల పరిస్థితి తెలియక బాధితుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా
ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. హోంమంత్రిని తక్షణమే ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేసి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సూచించారు.
ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Post a Comment