ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు అదుపుతప్పి పంట పొలంలోకి దూసుకెళ్లిన ఘటన కలకలం
స్థానికుల కథనం మేరకు, సుమారు 40 మంది ప్రయాణికులతో సోమవారం అర్ధరాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన బస్సు, 44వ జాతీయ రహదారిపై కొండేరు స్టేజీ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ముందుగా వెళ్తున్న ఓ లారీని తప్పించబోయే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డుపై నుంచి దూసుకెళ్లి పంట పొలంలోకి వెళ్లింది.
ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడి లేచారు. అత్యవసర అద్దాలను పగులగొట్టి బయటకు వచ్చిన ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం ఇతర వాహనాల ద్వారా వారు హైదరాబాద్‌కు తరలిపోయారు.
సమాచారం అందుకున్న హైవే సిబ్బంది క్రేన్, జేసీబీల సహాయంతో బస్సును పొలం నుంచి రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఘటనపై ఇటిక్యాల ఎస్‌ఐను వివరణ కోరగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
వ్యవసాయ పొలంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడు శివారులోని వ్యవసాయ పొలంలో గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది.
మంగళవారం స్థానికులు పొలంలో మృతదేహం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేశారు. నేవీ బ్లూ టీషర్ట్, గ్రే రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు.
మృతుడి కుడి కాలుకు నల్లటి తాడు ఉండటంతో పాటు కుడిచేయి, కుడికాలు వికలాంగుడిలా కనిపిస్తున్నాయని ఎస్‌ఐ స్వాతి వెల్లడించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 70288 లేదా 93469 87128 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment