విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా – పలువురికి గాయాలు
జగిత్యాల జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తున్న టాటా మ్యాజిక్ ఆటో మల్లాపూర్‌లోని మోడల్ స్కూల్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది.
సమాచారం ప్రకారం, వాహనంలో సుమారు 15 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా వాహనం నియంత్రణ కోల్పోవడంతో రోడ్డుపై బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని మల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరికి స్వల్ప గాయాలు కాగా, మరికొందరికి గాయాల తీవ్రతపై వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

Post a Comment