హైదరాబాద్‌లో స్వల్ప భూ ప్రకంపనలు
హైదరాబాద్, ఫిబ్రవరి 10: నగరంలో స్వల్ప భూ ప్రకంపనలు కలకలం రేపాయి. హైదరాబాద్ గాజులరామారం పరిధిలోని మెట్‌ఖాన్‌గూడా ప్రాంతంలో మంగళవారం ఉదయం 10:10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించినట్లు శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. అకస్మాత్తుగా వచ్చిన ఈ శబ్దంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
భూమి కంపించినట్లుగా అనిపించడంతో పాటు పెద్ద శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కొందరు పిల్లలు, వృద్ధులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఒకరితో ఒకరు సమాచారం పంచుకుంటూ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొందరు ఇది స్వల్ప భూకంపమే కావచ్చని, మరికొందరు ఏదైనా పేలుడు పదార్థాల శబ్దమా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పటివరకు అధికారికంగా భూకంపం నమోదైనట్లు ఎలాంటి స్పష్టమైన సమాచారం వెలువడలేదు. సంబంధిత అధికారులు, భూకంప పరిశీలనా కేంద్రాల నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సంఘటనపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనతో గాజులరామారం పరిసర ప్రాంతాల్లో కొంతసేపు భయాందోళన వాతావరణం నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సమాచారం వచ్చే వరకు పుకార్లను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు.

Post a Comment