ఇల్లందులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళల దుర్మరణం
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలను విషాదంలో ముంచేసింది. మండలంలోని సుదిమల్ల గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో కిందపడిన వారిపై నుంచి లారీ దూసుకెళ్లి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఇల్లందు మండలం కొల్లాపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు పాయం సురేశ్, పాయం చిన్ని, పాయం ధనలక్ష్మి (45), జయశ్రీ (18) రెండు బైకులపై వివాహ వేడుకకు హాజరుకావడానికి బయలుదేరారు. ప్రయాణంలో ప్రమాదవశాత్తు రెండు బైకులు ఒకదానినొకటి ఢీకొని కిందపడ్డాయి. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారి పైనుంచి వెళ్లడంతో ధనలక్ష్మి, జయశ్రీలు ఘటనాస్థలంలోనే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సురేశ్, చిన్ని లను వెంటనే ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మంకు రిఫర్ చేసినట్లు సమాచారం.
సంఘటన స్థలాన్ని హసీనా పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విషాద ఘటనతో కొల్లాపురం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.

Post a Comment