కవిత సంతోషాన్ని లాగేసుకున్న ఫార్వార్డ్ బ్లాక్ నాయకులు
కవిత సంతోషాన్ని లాగేసుకున్న ఫార్వార్డ్ బ్లాక్ నాయకులు కొన్ని గంటల పాటు కూడా కల్వకుంట్ల కవిత సంతోషం నిలవలేదు. గద్వాల జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ ఫలితాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మధ్యాహ్నం సమయంలో వడ్డేపల్లి మున్సిపాలిటీని All India Forward Bloc (AIFB) కైవసం చేసుకుందని వార్తలు వెలువడ్డాయి. మొత్తం 12 వార్డుల్లో 10 వార్డుల్లో ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థులు గెలవగా, మిగిలిన రెండు వార్డుల్లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో మున్సిపాలిటీ ఫార్వార్డ్ బ్లాక్ ఖాతాలో పడింది.
ఈ గెలుపు అధికారికంగా ప్రకటించగానే Telangana Jagruthi కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. ఎందుకంటే కల్వకుంట్ల కవిత నాయకత్వంలోని జాగృతి నేతలే ఫార్వార్డ్ బ్లాక్ సింహం గుర్తుపై పోటీ చేసి గెలిచారనే ప్రచారం ముందుగా జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో ఫార్వార్డ్ బ్లాక్‌తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్నట్లు కవిత స్వయంగా ప్రకటించడంతో, సింహం గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులంతా జాగృతి వర్గానికే చెందినవారనే అభిప్రాయం ఏర్పడింది.
ఫలితాలు రాగానే కవితతో కలిసి జాగృతి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అయితే ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫార్వార్డ్ బ్లాక్ నేత వడ్డేపల్లి శ్రీనివాస్, కవితకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తామంతా అసలైన ఫార్వార్డ్ బ్లాక్ నాయకులమని, చాలా కాలంగా రాజకీయాల్లో పనిచేస్తున్నామని చెప్పారు. తమ గెలుపుకు కవితకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు.
తమ తరఫున బీఫారాలు తీసుకునేందుకు వెళ్లినప్పుడు అక్కడ కవిత ఉన్నందున ఆమె చేతుల మీదుగా బీఫారాలు అందుకున్నామని, అంతే తప్ప తాము జాగృతి నాయకులమని అనుకోవడం సరైంది కాదన్నారు. తమ గెలుపుకోసం కవిత ఒక్కసారి కూడా ప్రచారం చేయలేదని, అలాంటప్పుడు ఈ విజయాన్ని జాగృతి ఖాతాలో ఎలా వేస్తారని ప్రశ్నించారు.
వడ్డేపల్లి శ్రీనివాస్ తాజా ప్రకటనతో రాజకీయంగా చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలపై కవిత లేదా జాగృతి నాయకత్వం ఎలా స్పందిస్తుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Post a Comment