కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్, డిప్యూటీ మేయర్ ఏకగ్రీవ ఎన్నిక
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. మున్సిపల్ సాధారణ ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం మరియు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియను నియమావళి ప్రకారం నిర్వహించారు.
సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అధ్యక్షత వహించి, ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 60 డివిజన్లకు గాను ఎన్నికైన కార్పొరేటర్లు హాజరై ప్రమాణ స్వీకారం చేశారు. సీపీఐ పార్టీకి చెందిన 22 మంది, కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది, బీజేపీకి చెందిన 1 మంది, సీపీఎం పార్టీకి చెందిన 1 మంది, స్వతంత్రంగా గెలుపొందిన 6 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 8 మంది కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు.
అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియ చేపట్టగా, 20వ డివిజన్‌కు చెందిన సీపీఐ కార్పొరేటర్ మూడ్ గణేష్ మేయర్‌గా, 8వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ సిరిపురపు లలితా కుమారి డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎక్స్-అఫీషియో సభ్యులుగా సమావేశానికి హాజరైన స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించారు.
ఈ సందర్భంగా నూతన మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ, కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో సమాన అభివృద్ధి సాధించేందుకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పారదర్శక, బాధ్యతాయుత పాలన అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎక్స్-అఫీషియో సభ్యులు నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్పొరేషన్ అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు అమోయ్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన ఐడీఓసి కార్యాలయం నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాతతో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment