విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.1 కోటి బీమా చెక్కులు అందజేసిన సీఎం
హైదరాబాద్, మార్చి 23: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ శాఖ ఉద్యోగుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఒక్కొక్క కుటుంబానికి రూ.1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమం అసెంబ్లీ కమిటీ హాలులో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. విధి నిర్వహణలో మృతి చెందిన ఓర్సు సురేష్, ముఖ్తార్ బేగ్ కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చినందుకు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను సీఎం అభినందించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. సీపెక్ సర్వే ఆధారంగా గుర్తించిన కుటుంబాలన్నింటికీ రూ.5 లక్షల బీమా వర్తింపజేస్తున్నామని పేర్కొన్నారు. కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు “కుటుంబ బీమా” పథకాన్ని తీసుకువచ్చామని చెప్పారు.
అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబాల్లో మనోధైర్యం నింపడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజహరుద్దీన్ తదితరులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Post a Comment