సైబర్ కేటుగాళ్లపై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం – 117 మంది అరెస్ట్
హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సైబర్ మోసగాళ్లపై కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. విదేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్న క్రిమినల్స్‌కు మ్యూల్ అకౌంట్లు సమకూర్చే నెట్వర్క్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి వరుసగా అరెస్టులు చేస్తున్నారు.
ఫిబ్రవరిలో “ఆపరేషన్ ఆక్టోపస్” పేరుతో ప్రత్యేక బృందాలు పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించగా మొత్తం 117 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీటిలో ఎక్కువగా 63 ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసులు ఉండగా, 6 డిజిటల్ అరెస్ట్ మోసాలు, 4 ఓటీపీ ఫ్రాడ్ కేసులు, ఒక సోషల్ మీడియా మోసం కేసు నమోదయ్యాయి. అదేవిధంగా గత నెలలో బాధితులకు రూ.34.76 లక్షలు రీఫండ్ చేశారు.
16 రాష్ట్రాల్లో ఆపరేషన్
అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్) ఎం. శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆపరేషన్ ఆక్టోపస్‌లో భాగంగా 16 రాష్ట్రాల్లో అరెస్టు చేసిన 117 మంది నిందితులకు దేశవ్యాప్తంగా 1,081 కేసులతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. వీరి ఖాతాల్లో రూ.139 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నిర్ధారణ అయింది.
నిందితుల నుంచి పోలీసులు భారీగా సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో
- రూ.36 లక్షల నగదు
- 221 మొబైల్ ఫోన్లు
- 26 ల్యాప్‌టాప్‌లు
- 115 చెక్‌బుక్కులు
- 141 సిమ్ కార్డులు
- 54 డెబిట్ కార్డులు
- 56 షెల్ కంపెనీల స్టాంపులు
- ఒక క్యాష్ కౌంటింగ్ మిషన్
- 152 పాస్‌బుక్కులు
- 5 ట్రేడ్ లైసెన్సులు
- 6 ఆడిట్ నివేదికలు
- 3 లెడ్జర్లు
సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
జోనల్ సైబర్ సెల్స్‌కు వేల పిటిషన్లు
గత నెలలో జోనల్ సైబర్ సెల్స్‌కు 2,963 పిటిషన్లు అందాయి. వాటిలో 461 కేసుల్లో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి, దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుల్లో బాధితులకు రూ.24.10 లక్షలు రీఫండ్ చేశారు.
సైబర్ పెట్రోలింగ్‌తో బెట్టింగ్ యాప్‌లపై చర్య
సైబర్ పెట్రోలింగ్ ద్వారా సోషల్ మీడియాలో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్న 124 ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైళ్లను గుర్తించారు. ఇవి 539 పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్లు నడుపుతూ యువతను బెట్టింగ్ వైపు ఆకర్షిస్తున్నట్లు గుర్తించి, ఆ 124 ప్రొఫైళ్లను తొలగించారు.
“సీ మిత్ర” ద్వారా సహాయం
“సీ మిత్ర” సేవ ద్వారా గత నెలలో 2,396 మంది సైబర్ మోసాల బాధితులకు ఫిర్యాదులు నమోదు చేసుకునేందుకు మార్గదర్శకత్వం అందించారు. వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 257 జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.
సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని, అలాగే cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని అదనపు కమిషనర్ శ్రీనివాస్ సూచించారు.

Post a Comment