మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి – పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్‌లో “ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల భద్రత, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా డీసీపీ బి. రామ్ రెడ్డి మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు బానిసలైతే భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు. విద్యార్థులు చిన్న వయసులోనే లక్ష్యాలను ఏర్పరచుకుని వాటి సాధన కోసం కష్టపడి చదవాలని సూచించారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని, ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు మరియు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, విద్యార్థుల్లో ఉన్న అపారమైన శక్తిని సరైన దిశలో వినియోగించుకోవాలని సూచించారు. యువతలో ఉన్న ఉత్సాహం, శక్తిని క్రీడలు, చదువు మరియు సమాజ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని తెలిపారు. మత్తు పదార్థాల వైపు వెళ్లితే ముందుగా ఆరోగ్యం దెబ్బతింటుందని, తరువాత జీవితమే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఎవరికైనా మత్తు పదార్థాల అలవాటు ఉన్నట్లు తెలిసితే వారిని ముందుగా మార్చే ప్రయత్నం చేయాలని, మార్పు రాకపోతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.
రోడ్డు భద్రతపై కూడా ఆయన సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువకులే బాధితులవుతున్నారని పేర్కొన్నారు. వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ఎల్లప్పుడూ రహదారి ఎడమ వైపున ప్రయాణిస్తూ, భారీ వాహనాలను దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని హెచ్చరించారు.
సైబర్ నేరాల విషయంలో కూడా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఓటీపీలు అడగడం, అనుమానాస్పద లింకులు పంపడం వంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. గతంలో అపరిచితులు ఇచ్చే చాక్లెట్లు తీసుకోవద్దని చెప్పేవారని, ఇప్పుడు అదే మోసం మొబైల్ ఫోన్ ద్వారా వచ్చే లింకులు, మెసేజ్‌ల రూపంలో జరుగుతోందని వివరించారు. అందువల్ల మొబైల్ ఫోన్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పోలీస్ కళాబృందం పాటల ద్వారా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం డ్రగ్స్ వినియోగాన్ని నివారించేందుకు ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ప్రవచనకర్త ఎస్.పి. నాయక్ బంజారా, రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, ఎస్‌ఐలు రమేష్, అనూష, పోలీస్ సిబ్బంది మరియు సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment