బైపాస్‌లో దాబాపై సంయుక్త దాడి… 18 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బైపాస్ రోడ్డులో ఉన్న కుమార్ ఫ్యామిలీ దాబాపై రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించి భారీ అక్రమాన్ని బయటపెట్టారు. గృహ వినియోగానికి మాత్రమే అనుమతించిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
నమ్మదగిన సమాచారం మేరకు తూప్రాన్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగ కృష్ణ, తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో దాబాలో హోటల్ కార్యకలాపాలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అక్కడే 18 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగ కృష్ణ తెలిపారు. గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వినియోగించడం చట్ట విరుద్ధమని, ఇటువంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ దాడిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమాలపై నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Post a Comment