సంగారెడ్డి జిల్లాలో దారుణం.. వాచ్‌మన్ దంపతుల హత్య
సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సిటిజన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
ఘటన వివరాలు
పోలీసుల వివరాల ప్రకారం... నిన్న (శుక్రవారం) రాత్రి నిర్మాణంలో ఉన్న భవనం వద్ద కాపలాగా ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. హత్యకు గురైన దంపతులను సోమ్లా దశరథ్ (50), మాన్యమ్మ (45)గా గుర్తించారు. వీరు మహబూబాబాద్ జిల్లా దొంగచింత తండాకు చెందినవారు. సిటిజన్ కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న భవనానికి వాచ్‌మన్‌గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
క్లూస్ టీం రంగంలోకి
సమాచారం అందుకున్న వెంటనే పఠాన్‌చెరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించేందుకు క్లూస్ టీంను రంగంలోకి దించారు.
నిందితులను గుర్తించేందుకు కాలనీ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే మృతుల కుటుంబ నేపథ్యం, ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా అనే కోణంలో స్థానికులు, సహచర కార్మికులను విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పఠాన్‌చెరు పోలీసులు తెలిపారు.

Post a Comment