భారీ అగ్ని ప్రమాదం.. 50కి పైగా ఫర్నిచర్ షాపులు దగ్ధం
హైదరాబాద్: Hyderabad నగరంలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాచుపల్లి–మియాపూర్ రోడ్డులోని Vignan Jyothi Institute of Engineering and Technology సమీపంలో ఉన్న ఫర్నిచర్ షాపుల సముదాయంలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. KGR Convention కు ఆనుకుని ఉన్న వరుస దుకాణాలు మంటల్లో చిక్కుకోవడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం, మొదట రెండు దుకాణాల్లో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే పక్కపక్కన ఉన్న దాదాపు 50కి పైగా ఫర్నిచర్ షాపులకు వ్యాపించాయి. రోడ్డుకి ఆనుకుని ఫుట్‌పాత్‌లపై తాత్కాలిక షెడ్లలో పెద్ద ఎత్తున ఫర్నిచర్ నిల్వ చేయడం వల్ల మంటలు వేగంగా విస్తరించాయి. ముందుభాగంలో విక్రయాలు నిర్వహిస్తూ, వెనుకభాగంలో గోదాములుగా భారీగా కలప, ఫోమ్, ఇతర దహన పదార్థాలు నిల్వ ఉంచడం అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లైంది.
సమాచారం అందుకున్న వెంటనే ఐదు డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు, హైడ్రా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. దాదాపు 10 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి గంటల తరబడి శ్రమించారు. భారీ పరిమాణంలో ఉన్న ఫర్నిచర్ సామగ్రి కారణంగా మంటలను నియంత్రించడం సవాలుగా మారింది.
ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల విలువైన ఫర్నిచర్ దగ్ధమైనట్లు అంచనా వేస్తున్నారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే చిరు వ్యాపారులు తమ ఆస్తి కళ్లముందే బూడిదవుతుండటంతో ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment