గోదావరి పుష్కర ఘాట్‌ల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ రామ్‌రెడ్డి
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి ఘాట్‌ల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు.
పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్, గోలివాడ, గోదావరి బ్రిడ్జ్ సమీపంలోని పుష్కర ఘాట్‌లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా భక్తుల రాకపోకలు, భద్రతా చర్యలు, బ్యారికేడింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, లైటింగ్, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ మళ్లింపులపై సమీక్ష నిర్వహించారు.
ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ, శుభ్రత నిర్వహణ, తక్షణ వైద్య సహాయం వంటి అత్యవసర సేవలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పుష్కర ఘాట్‌ల వద్ద ఎలాంటి అపశృతి చోటుచేసుకోకుండా సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ఈ పరిశీలనలో ఏసీపీ రమేష్, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, జీడీకే-2 టౌన్ సీఐ ప్రసాద్ రావు, అంతర్గాం ఎస్ఐ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment