-->

మియాపూర్ మక్తలో విషాదం: ప్రేమ వ్యవహారంతో యువతి బల్మరణం

మియాపూర్ మక్తలో విషాదం: ప్రేమ వ్యవహారంతో యువతి బల్మరణం


హైదరాబాద్ నగర పరిధిలోని మియాపూర్ మక్త ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నారాయణఖేడ్ గ్రామానికి చెందిన మేఘవత్ సోని బాయి (యువతి) ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

సోని బాయి మియాపూర్ మక్తలోని ‘ఫస్ట్ హెల్త్ ల్యాబ్స్’లో స్టాఫ్ నర్సుగా గత ఒక సంవత్సరం నుండి పనిచేస్తూ, రెడ్డి ఎంక్లేవ్ ప్రాంతంలోని పీజీ హాస్టల్‌లో నివసిస్తోంది. సోమవారం ఆమె విధులకు హాజరు కాలేదు. అదే గదిలో నివసిస్తున్న స్నేహితులు ఉద్యోగాలకు వెళ్లగా, సోని గదిలోనే ఉండిపోయింది.

రాత్రి సుమారు 10 గంటల సమయంలో స్నేహితులు హాస్టల్‌కు తిరిగి వచ్చి గది తలుపులు లోపల నుంచి గడియ పెట్టి ఉన్నట్లు గమనించారు. పలుమార్లు పిలిచినా స్పందన లేకపోవడంతో హాస్టల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. కిటికీ ద్వారా లోపల చూసినప్పుడు సోని పైకప్పు ఉక్కుకు చున్నీతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది.

వెంటనే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి ఆమెను కిందకు దించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, గత కొంతకాలంగా తన సొంత గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆమె ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్లు తెలిసింది. వారి మధ్య ఇటీవల తలెత్తిన గొడవల కారణంగా మనస్తాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


గమనిక: మానసిక ఆందోళనలు, భావోద్వేగ సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణులను సంప్రదించడం ఎంతో ముఖ్యం. అవసరమైతే హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవచ్చు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793