ఆటోను ఢీకొన్న కారు.. ఏడుగురికి తీవ్ర గాయాలు
మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం జాతీయ రహదారి 365పై సీతారాం తండా స్టేజి సమీపంలో ఆటోను అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గ్రామస్తుల సమాచారం ప్రకారం, పురుషోత్తమగూడెం గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఒక శుభకార్యం కోసం ఆటోలో మహబూబాబాద్‌కు వెళ్తుండగా, కురవి వైపు నుంచి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పిట్టల శ్రీనివాస్, పిట్టల పద్మ, రామసాని వెంకన్న, గాలి అరుణ, గాలి గిరి, కేసరి శేషమ్మ, ఆటో డ్రైవర్ రవీందర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి రక్తస్రావం మరియు పలు ఎముకలు విరిగినట్లు 108 సిబ్బంది తెలిపారు. వీరిలో పిట్టల పద్మ, రామసాని వెంకన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
క్షతగాత్రులను మానుకోటలోని ప్రైవేట్ ఆసుపత్రి మరియు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తున్నారు.
ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Post a Comment