కనిపించని నెలవంక.. శనివారం రంజాన్ పండుగ
గురువారం ఆకాశంలో శవ్వాల్ మాసపు నెలవంక ఎక్కడా కనిపించలేదు. దీంతో ముస్లింలు శుక్రవారం కూడా ఉపవాస దీక్షలను కొనసాగించనున్నారు.
ఈ నేపథ్యంలో రుహిత్-ఎ-హిలాల్ కమిటీ అధికారికంగా ప్రకటించిన ప్రకారం, శనివారం దేశవ్యాప్తంగా రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్) ఘనంగా జరుపుకోనున్నారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, లక్నో వంటి ప్రధాన నగరాల్లో కూడా నెలవంక కనిపించకపోవడంతో రంజాన్ మాసం 30 రోజులు పూర్తి కానుంది.
పండుగ సందర్భంగా శనివారం ఉదయం 10 గంటలకు వివిధ ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థనలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా మక్కా మసీదు, పబ్లిక్ గార్డెన్స్ మసీదు, మీర్ ఆలం ఈద్గా వద్ద భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రార్థనల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, భద్రతా చర్యలపై పోలీసులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా, సౌదీ అరేబియా సహా పలు గల్ఫ్ దేశాల్లో శుక్రవారం రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. భారత్‌లో మాత్రం నెలవంక కనిపించని కారణంగా శనివారం వేడుకలు జరుగనున్నాయి. ఈ పండుగతో నెల రోజుల కఠిన ఉపవాస దీక్షలు ముగిసి, శవ్వాల్ మాసం ప్రారంభం కానుంది.

Post a Comment