మానవ అక్రమ రవాణా ముఠా పట్టివేత – గిరిజన మహిళలే లక్ష్యం
అసిఫాబాద్: ఏజెన్సీ ప్రాంతాల్లోని అమాయక గిరిజన మహిళలను మోసం చేసి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం నుంచి ఇద్దరు మహిళలను మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు గురువారం పోలీసులు చర్యలు చేపట్టి, మంచిర్యాల్–మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
జిల్లాలో కొంతకాలంగా రహస్యంగా మహిళల అక్రమ రవాణా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ముఠాలు పెళ్లి, ఉద్యోగం, డబ్బు ఆశ చూపించి మహిళలను మోసం చేసి ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయిస్తున్నాయి. ఒక్కో మహిళను రూ.2 నుంచి 3 లక్షల వరకు అమ్ముతున్నట్లు సమాచారం. ముఖ్యంగా గిరిజన, ఒంటరి, వితంతు మహిళలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు.
వెట్టిచాకిరి, వ్యభిచారంలోకి నెట్టివేత
ఏజెన్సీ గ్రామాల మహిళలను దళారులు టార్గెట్‌గా చేసుకుని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఆకర్షణీయమైన రూపం ఉన్న మహిళలను ఎంచుకుని, చివరకు వెట్టిచాకిరి లేదా వ్యభిచార గృహాల్లోకి నెట్టివేస్తున్నారు. పేదరికం, అవగాహన లేమి కారణంగా బలహీన వర్గాల మహిళలు ఎక్కువగా ఈ ముఠాల బారిన పడుతున్నారు.
ఇక జిల్లాలో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో బాలబాలికలు అదృశ్యమవుతున్నట్లు సమాచారం. వీరిలో చాలామంది ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
గతంలోనూ ఘటనలు
గత ఏడాది కూడా అసిఫాబాద్ మండలానికి చెందిన ఇద్దరు మహిళలను పెళ్లి పేరుతో మధ్యప్రదేశ్‌కు విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో మొత్తం 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ నిందితుల్లో ఓ కానిస్టేబుల్ ఉండటం అప్పట్లో సంచలనం రేపింది.
తాజాగా బెజ్జూర్ మండలంలో మళ్లీ ఇలాంటి ఘటన బయటపడటం పోలీసులకు సవాల్‌గా మారింది. అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Post a Comment