పేషంట్‌తో డాక్టర్ అసభ్య ప్రవర్తన ఆరోపణలు.. తొర్రూరులో కలకలం
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్‌పై అసభ్య ప్రవర్తన ఆరోపణలు రావడంతో స్థానికంగా కలకలం రేగింది.
వివరాల ప్రకారం.. తొర్రూరులోని విజయలక్ష్మి ఆసుపత్రిలో డా. కిరణ్ కుమార్ వద్ద జ్వరానికి చికిత్స కోసం 21 ఏళ్ల యువతి చేరింది. చికిత్సలో భాగంగా ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం డాక్టర్ యువతితో అనుచితంగా ప్రవర్తించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. “నువ్వు చాలా అందంగా ఉన్నావు” అంటూ యువతిని ముట్టుకున్నాడని వారు చెబుతున్నారు.
ఈ ఘటనపై యువతి వెంటనే తన తల్లికి వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని యువతిని అక్కడి నుంచి తీసుకెళ్లి మరో ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు తెలిసింది.
ఆదివారం ఉదయం యువతి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ను ప్రశ్నించగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆగ్రహించిన కుటుంబ సభ్యులు డాక్టర్‌పై దాడి చేసినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డా. కిరణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన ప్రస్తుతం తొర్రూరు పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment