కొత్తగూడెం కార్పొరేషన్‌లో సులబ్ కాంప్లెక్స్‌ల ఏర్పాటు చేయాలి: తెలంగాణ జాగృతి
కొత్తగూడెం, మార్చి 17: ప్రజల ప్రాథమిక సౌకర్యాల మెరుగుదల కోసం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సులబ్ కాంప్లెక్స్‌లను నిర్మించాలని తెలంగాణ జాగృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు డి. వీరన్న డిమాండ్ చేశారు.
మంగళవారం తెలంగాణ జాగృతి నాయకులు కార్పొరేషన్ మేయర్ గణేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, ఇటీవల ఎన్నికైనందుకు సన్మానించారు. అనంతరం పట్టణంలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని ముఖ్య ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని సూచించారు. అలాగే ప్రస్తుతం ఉపయోగంలో లేని సులబ్ కాంప్లెక్స్‌లను తిరిగి ప్రారంభించి, అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా నిర్మించాలని కోరారు.
అదేవిధంగా, కార్పొరేషన్ పరిధిలో కొత్తగా అర్హత పొందిన పింఛన్ లబ్ధిదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేయర్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు లకావత్ సురేష్, జిల్లా నాయకులు వాంకుడోత్ రవి, ఆటో విభాగం జిల్లా అధ్యక్షుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment