-->

మూడు నెలల ప్రేమ పెళ్లి… భర్త చేతిలో భార్య దారుణ హత్య

మిర్యాలగూడ మండలం గూడూరులో ఘటన.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు


నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువజంటలో ఆనందం మూడు నెలలు కూడా నిలవలేదు. భార్యను భర్తే హత్య చేసిన సంఘటన మిర్యాలగూడ మండలం గూడూరులో కలకలం రేపింది.

పోలీసులు మరియు స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం… తవీర్ అనే యువకుడు తన భార్య మనీషా చారును దారుణంగా హత్య చేశాడు. మూడు నెలల క్రితమే మనీషా–తవీర్‌లు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వివాహానంతరం వారి దాంపత్య జీవితం ఎక్కువకాలం కొనసాగలేదు.

జీవనోపాధి కోసం ఈ దంపతులు ఒడిశా రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చి గూడూరులోని ఓ ఇటుక బట్టీలో కూలీలుగా పనిచేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో వీరిద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ, ఘర్షణ చోటుచేసుకుని చివరకు మనీషా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

సంఘటన విషయం బయటపడడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త తవీర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హత్యకు గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఇంత దారుణంగా మృతి చెందడం ప్రాంతంలో విషాదాన్ని నింపింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793