పాఠశాల ప్రాంగణంలో చిన్నారిపై లైంగిక దాడి – ఇద్దరు విద్యార్థులు అదుపులో
జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మహదేవపూర్ మండల కేంద్రంలోని ఓ పాఠశాల ప్రాంగణంలో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అదే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సోమవారం ఆలస్యంగా బయటపడింది.
వివరాల ప్రకారం, స్కూల్ గ్రౌండ్‌లో ఆడుకుంటున్న చిన్నారికి ఐస్‌క్రీం ఇప్పిస్తామని చెప్పి 9వ తరగతి, 7వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పాఠశాల వెనుకకు తీసుకెళ్లి దాడి చేసినట్లు సమాచారం. అనంతరం బాధతో ఏడుస్తూ ఇంటికి చేరుకున్న చిన్నారిని గమనించిన తల్లి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అక్కడి వైద్యుల సూచన మేరకు భూపాలపల్లి 100 పడకల ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్య పరీక్షల అనంతరం లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయింది. దీంతో మంగళవారం చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. నిందితులైన ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Post a Comment