-->

కార్పొరేట్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఘనంగా ఇఫ్తార్ విందు

కార్పొరేట్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఘనంగా ఇఫ్తార్ విందు


కొత్తగూడెం: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సింగరేణి కార్పొరేట్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. గులాం రబ్బానీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ మతాలకు చెందిన అధికారులు, సిబ్బంది సోదరభావంతో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్పొరేట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం. సూర్యనారాయణ, సివిల్ సూపరింటెండెంట్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జీవించడమే సింగరేణి ప్రత్యేకత అని అన్నారు. భారతదేశం వంటి విభిన్న మతాలు, సంస్కృతులు కలిగిన దేశంలో ఒకరి పండుగలను మరొకరు పంచుకోవడం ద్వారా పరస్పర ప్రేమ, సత్సంబంధాలు మరింత బలపడతాయని తెలిపారు.

రంజాన్ ఉపవాసాలు మనుషుల్లో నియమ నిష్ఠలు, సహనం, దయ వంటి మానవతా విలువలను పెంపొందిస్తాయని, సమాజంలో శాంతి, సౌహార్దత నెలకొనాలని ఆకాంక్షించారు.

జమాతే ఇస్లామి హింద్ సభ్యులు షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ, సృష్టికర్త ఒకడే అని, అందరూ సోదరులుగా జీవించాలనే సందేశాన్ని ఖురాన్ అందిస్తుందని చెప్పారు. రంజాన్ నెలలో ఉపవాసాల ద్వారా ఆకలి బాధను అనుభవించి, సమాజంలోని పేదలను ఆదుకునే గుణం అలవడుతుందని వివరించారు. కొత్తగూడెం మతసహనానికి నిలయంగా నిలిచిందని, మతాల మధ్య విభేదాలు సృష్టించే వారిని దూరంగా ఉంచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎ.ఈ. క్రాంతి, జేటిఓ సాంబశివరావు, శ్రీనివాస్, కార్పొరేటర్ కె. శ్రీనివాస్, రమేష్ (ఏఐటీయూసీ), సోమేష్, మదు (ఐఎన్‌టీయూసీ), సూర్యనారాయణ (టీబీజేకేఎస్), రుక్మదర్, కిరణ్, నజముద్దీన్, యాసిన్, ఇనయతుల్లాహ్, యూసుఫ్, రెహ్మాన్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793