ఈనెల 20న మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
భూపాలపల్లి జిల్లా: ఏప్రిల్ 17: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 20న భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డకు పర్యటించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.
ఈ సందర్భంగా కాటారం మండలం నస్తూరిపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఈ పర్యటనపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ, అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 2023 ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజ్‌లో కుంగిపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అప్పటి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను బీఆర్ఎస్ ఖండిస్తోంది.
ఇక ప్రాజెక్టుపై విచారణ కోసం ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే తన నివేదికను సమర్పించింది. ఈ కమిషన్‌పై బీఆర్ఎస్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానిపై తీర్పు త్వరలో వెలువడే అవకాశం ఉంది.
ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్‌లో కుంగిపోయిన పిల్లర్లను పరిశీలించి, పునరుద్ధరణ పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష జరపనున్నారు.
అదే సమయంలో గోదావరి నది తీరంలో జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించనున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించనున్నట్లు సమాచారం.

Post a Comment