కస్టమ్స్ తనిఖీలు.. 3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి సీజ్
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా జరుగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాలపై కస్టమ్స్ అధికారులు గట్టి దెబ్బ కొట్టారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న భారీ డ్రగ్స్ నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈరోజు ఉదయం Thai Airways విమానంలో బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన కస్టమ్స్ అధికారులు ఆమెను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆమె లగేజీలో దాచిపెట్టిన సుమారు 3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి బయటపడింది. సాధారణ గంజాయితో పోలిస్తే ఈ హైడ్రోపోనిక్ గంజాయి మత్తు తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ కూడా ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.
మహిళా స్మగ్లర్ అరెస్ట్
పట్టుబడిన డ్రగ్స్‌ను సీజ్ చేసిన అధికారులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ఆమె కేవలం డ్రగ్స్ తరలించే “డ్రగ్ మ్యూల్” మాత్రమేనా? లేక అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో నేరుగా సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇక నగరంలో ఎవరికి ఈ డ్రగ్స్ చేరవేయాలనుకుంది అనే అంశంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల కాలంలో బ్యాంకాక్, దుబాయ్ వంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ అక్రమ రవాణా పెరుగుతున్న నేపథ్యంలో, కస్టమ్స్‌తో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నిఘాను మరింత కఠినతరం చేశారు.

Post a Comment