నామినేటెడ్ పోస్టుల కోసం కాంగ్రెస్ నేతల వెయిటింగ్ కొనసాగుతోంది
హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్నా… నామినేటెడ్ పోస్టుల భర్తీ మాత్రం ఇంకా ముందుకు కదలడం లేదు. మంచి ముహూర్తాలు, పండుగలు, గడువులు అన్నీ దాటిపోయినా… “త్వరలో భర్తీ” అనే మాటలే వినిపిస్తున్నాయి కానీ అమలు మాత్రం కనిపించడం లేదు.
పీసీసీ చీఫ్ నుంచి తరచూ “ఇంకో వారం, పది రోజుల్లో” అనే స్టేట్మెంట్లు వస్తున్నాయి. కానీ అదే గడువు పదే పదే వాయిదా పడుతూ రావడంతో నేతల్లో అసహనం పెరుగుతోంది. అసలు పోస్టులు వస్తాయా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
నామినేటెడ్ పదవుల పంపకాలు ఎక్కడ ఆగిపోయాయి? ఎందుకు ఆలస్యం అవుతోంది? అన్నది ఇప్పటికీ స్పష్టత లేని అంశంగా మారింది. పదవులు ఆశించిన నేతలు నిర్వేదంలోకి వెళ్లిపోయారు. “అదిగో వస్తుంది… ఇదిగో వస్తుంది…” అన్న మాటలతోనే కాలం గడుస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పార్టీ సమావేశాల్లో “జాబితాలు పంపండి… భర్తీ చేద్దాం” అని ప్రకటించారు. దానికి అనుగుణంగా జిల్లాల వారీగా జాబితాలు కూడా సిద్ధమయ్యాయి. అయినా కూడా ప్రక్రియ ముందుకు కదలకపోవడం గందరగోళానికి దారితీస్తోంది.
ఇటీవల కుల సంఘాలకు సంబంధించిన కార్పొరేషన్లలో 16–17 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించినా… నెల గడిచినా చర్యలు కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ అదే గడువు – “వారం, పది రోజులు”.
పేర్ల ఎంపిక సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నాయకులతో చర్చల అనంతరం ఫైనల్ అవుతున్నట్లు సమాచారం. అయితే ఈ కమిటీలో సమన్వయం లోపమే ఆలస్యానికి కారణమన్న చర్చ కూడా బలంగా వినిపిస్తోంది.
ఇప్పటికే 37 కార్పొరేషన్లకు చైర్మన్లు నియమించిన ప్రభుత్వం… డైరెక్టర్ పోస్టులను మాత్రం భర్తీ చేయకపోవడం నేతల్లో మరింత అసంతృప్తిని పెంచుతోంది. ఇంకొన్ని నెలల్లో చైర్మన్ పదవుల గడువు ముగిసే పరిస్థితి ఉండటంతో… ఈ ఆలస్యం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
క్షేత్రస్థాయిలో క్యాడర్‌లో కూడా అసంతృప్తి పెరుగుతోంది. పనులు జరగడం లేదన్న ఆగ్రహం ఒకవైపు… పదవులు రాకపోవడంతో నేతల్లో నిరాశ మరోవైపు కనిపిస్తోంది. చాలా కాలం ఎదురుచూసి తర్వాత పదవి వచ్చినా… ఆ జోష్ సగం తగ్గిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటికైనా ఈ గందరగోళానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడు ఫుల్‌స్టాప్ పెడుతుందో చూడాలి.

Post a Comment