-->

సమయానికి రాని పంతుళ్లు.. అదే దారిలో పిల్లలు!

సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నిర్లక్ష్యం వెలుగులోకి


సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం బయటపడింది. ఉదయం 8:10 గంటలు కావస్తున్నప్పటికీ పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు కూడా హాజరు కాకపోవడం స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది.

ఎండాకాలం నేపథ్యంలో పాఠశాల బోధన సమయం తగ్గినప్పటికీ, సమయానికి రావాల్సిన ఉపాధ్యాయులు ఆలస్యంగా రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాఠశాలలో గంట కొట్టాల్సిన బెల్ కూడా సరిగా అమర్చకుండా కింద ఉండడంతో, ఒక విద్యార్థి దానిని పైకి తగిలించేందుకు ఇబ్బందులు పడుతున్న దృశ్యం కనిపించింది.

అక్కడ ఉన్న ఐదారు మంది విద్యార్థులను ప్రశ్నించగా, "టీచర్లు ఇంకొంచెం సమయం తర్వాత వస్తారు" అని సమాధానం ఇచ్చారు. ఇది పాఠశాలలోని నిర్వహణ లోపాలను స్పష్టంగా చూపుతోంది.

పద్ధతులు నేర్పాల్సిన గురువులే పద్ధతులు పాటించకపోతే, విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా నిర్లక్ష్యం కారణంగానే కొందరు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించడానికి వెనుకడుగు వేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఇలాంటి ఘటనలపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793