మోడ్రన్ ఇఖ్రా స్కూల్‌లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
కొత్తగూడెం: స్థానిక సుభాష్ చంద్రబోస్ నగర్ రామవరం ప్రాంతంలోని మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి భవిష్యత్తుకు మార్గదర్శకులని పేర్కొన్నారు. విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాకుండా, మంచి సంస్కారం, నైతిక విలువలు కూడా నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. చదువు సంపాదన కోసం మాత్రమే కాకుండా, సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని సూచించారు.
మండల విద్యాధికారిణి మదుర వాణి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత ముఖ్యమని తెలిపారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులే పునాది కావాలని అన్నారు.
జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి సాబీర్ పాష మాట్లాడుతూ, ఈ రోజుల్లో విద్య వ్యాపారంగా మారుతున్న నేపథ్యంలో మోడ్రన్ ఇఖ్రా పాఠశాల తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందించడం అభినందనీయమని అన్నారు.
మొక్కల వెంకటయ్య మాట్లాడుతూ, పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో నైతిక విలువలతో కూడిన విద్య అందించడం ఈ పాఠశాల ప్రత్యేకతగా నిలుస్తోందన్నారు.
విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చదువు విలువ, స్వచ్ఛ భారత్, రైతుల ప్రాముఖ్యత, కాలం విలువ వంటి అంశాలపై చేసిన ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అబ్దుల్ బాసిత్, ప్రధానోపాధ్యాయురాలు పర్వీన్ సుల్తాన, వార్డు కౌన్సిలర్ కూరపాటి సుదాకర్, ఉపాధ్యాయులు లక్ష్మి ప్రసన్న, శిరీష, సల్మా, విజయలక్ష్మి, లతీఫా, సరస్వతి, అనిత, నుస్రత్, సల్మా జబీన్, ఖాజ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment