-->

తెలంగాణలో ప్లాస్టిక్ పూల నిషేధం … ప్రభుత్వ కీలక నిర్ణయం

తెలంగాణలో ప్లాస్టిక్ పూల నిషేధం … ప్రభుత్వ కీలక నిర్ణయం


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ మార్కెట్లలో ప్లాస్టిక్ పూల విక్రయాలపై నిషేధం విధిస్తూ మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రైతు బజార్లు, ప్రభుత్వ మార్కెట్లలో ప్లాస్టిక్ పూలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ రైతు బజార్లు, మార్కెట్లలో ఈ నిషేధం అమల్లోకి రానుంది. ప్లాస్టిక్ పూల విక్రయం కొనసాగిస్తే వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసే వరకు చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సహజ పూలు మరియు వాటి ఉత్పత్తుల విక్రయానికే అనుమతి ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇటీవలి కాలంలో రైతు బజార్లలో ప్లాస్టిక్ పూల అమ్మకాలు పెరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో సహజ పూలకు డిమాండ్ తగ్గి, పూల వ్యాపారులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పూల వ్యాపారులు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రైతు మేళాల్లో పాల్గొన్న సందర్భంగా వ్యాపారులు తమ సమస్యలను మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్లాస్టిక్ పూల విక్రయాలపై నిషేధం విధించేలా చర్యలు చేపట్టారు.

ఈ నిర్ణయం ద్వారా సహజ పూల వ్యాపారులకు ఊరట లభించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793