జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తుల అనుమానం
హైదరాబాద్‌లో మరో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ మహానగర జలమండలి (HMWSSB) రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ లక్ష్మీ కుమార్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించారు.
సికింద్రాబాద్ మల్లాపూర్‌లోని వెంకటరమణ కాలనీలో ఉన్న లక్ష్మీ కుమార్ ఇంట్లో భారీ మొత్తంలో నగదు బయటపడటంతో అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంట్లో లభించిన నగదును లెక్కించేందుకు ప్రత్యేక క్యాష్ కౌంటింగ్ యంత్రాలను వినియోగించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన ఇంట్లోనే సుమారు రూ.1.05 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా భారీ మొత్తంలో బంగారం కూడా గుర్తించినట్లు సమాచారం. స్వాధీనం చేసిన బంగారం విలువను అధికారులు ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. దాడుల సమయంలో పలు ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు కూడా లభ్యమైనట్లు తెలిసింది.
ఏసీబీ అధికారులు హైదరాబాద్‌తో పాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. లక్ష్మీ కుమార్ బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆయన అక్రమాస్తుల పూర్తి వివరాలను వెలికితీసే దిశగా అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇప్పటివరకు గుర్తించిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో మూడు ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు, హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీల్లో మూడు ఫ్లాట్లు, నగర శివార్లలో ఆరు ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనాల మేరకు లక్ష్మీ కుమార్ ఆస్తుల మొత్తం విలువ రూ.100 కోట్లకు పైగా ఉండవచ్చని సమాచారం.
ఇక ఆయనకు సంబంధించిన బ్యాంకు లాకర్లను కూడా త్వరలోనే తెరిచి పరిశీలించనున్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. నీటి కనెక్షన్లు, ట్యాంకర్ సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణ వంటి కీలక బాధ్యతలు నిర్వహించే జలమండలి అధికారిపై ఈ స్థాయి అవినీతి ఆరోపణలు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Post a Comment