ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా
వనపర్తి టౌన్, వెలుగు: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు సోమవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
అంతకుముందు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే పీఏకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆశా కార్యకర్తలకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా ఆశా కార్యకర్తలపై పెరుగుతున్న పని భారం తగ్గించాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Post a Comment