-->

తల్లి మృతదేహంతో హైవేపై కూతుళ్ల ధర్నా.. చివరి చూపుకైనా రాని భర్తపై ఆగ్రహం

తల్లి మృతదేహంతో హైవేపై కూతుళ్ల ధర్నా.. చివరి చూపుకైనా రాని భర్తపై ఆగ్రహం

నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో భార్య మృతి చెందినప్పటికీ, చివరి చూపుకైనా రాని భర్త తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో మృతురాలి కుమార్తెలు, బంధువులు శవంతో కలిసి హైవేపై ధర్నాకు దిగారు.

దామరచర్లకు చెందిన బైరం శ్రీకాంత్, లక్ష్మి దంపతులు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో శ్రీకాంత్ భార్య, పిల్లలను వదిలి దూరంగా ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో లక్ష్మి ఇద్దరు కుమార్తెలను పోషిస్తూ గ్రామంలోనే ఒంటరిగా జీవనం సాగిస్తోంది.

కుటుంబ సమస్యలపై లక్ష్మి పలుమార్లు పోలీసులను ఆశ్రయించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే మనస్తాపంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన వైద్యం అందక శనివారం మృతి చెందినట్లు తెలిపారు.

లక్ష్మి మృతి విషయాన్ని భర్త శ్రీకాంత్‌కు తెలియజేసినా, అంత్యక్రియలకు రావడానికి కూడా ఆయన నిరాకరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఆగ్రహానికి గురైన కుమార్తెలు, బంధువులు మృతదేహంతో కలిసి అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపై రాస్తారోకో నిర్వహించారు.

“గత ఐదేళ్లుగా మా తండ్రి మమ్మల్ని తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నాడు. ఆ బాధలతోనే మా తల్లి ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. ఇప్పటికైనా వచ్చి మా అమ్మకు హిందూ సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించాలి” అంటూ కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు.

ఈ నిరసనతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793