భూవివాదం నేపథ్యంగా తల్లీకుమార్తెల దారుణ హత్య..
నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో భూవివాదం నేపథ్యంలో తల్లీకుమార్తెలను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఐదేళ్లుగా భూమి వివాదంపై సమీప బంధువులతో న్యాయపోరాటం సాగిస్తున్న సుమలత(40), ఆమె కుమార్తె లావణ్య(20)లను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన ఆదివారం ఉదయం గ్రామ శివారులోని పామాయిల్ తోటలో చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్ష యాదయ్య 16 ఏళ్ల క్రితం మృతిచెందగా, అతని భార్య సుమలత కుమార్తె లావణ్యతో కలిసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది. సుమలతకు పుట్టింటి నుంచి వచ్చిన మూడు ఎకరాల భూమితో పాటు, భర్త పేరిట ఉన్న పొలాలను సాగు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.
గతంలో యాదయ్య ఆస్తి వివాదం పరిష్కారంలో భాగంగా గ్రామ పెద్దల సమక్షంలో అతని అక్కాచెల్లెళ్లకు తలా ఒక ఎకరం భూమి ఇచ్చినట్లు సమాచారం. అనంతరం గ్రామంలో ఉన్న మరో ఎనిమిది ఎకరాల భూమిపై కూడా వాటా కోరుతూ బంధువులు పంచాయితీ పెట్టడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో తమకు న్యాయం చేయాలని సుమలత, లావణ్య కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వీరికి అనుకూలంగా రావడంతో ఆ ఎనిమిది ఎకరాల భూమిని లావణ్య పేరిట పట్టా చేయించారు.
ఇటీవల లావణ్యకు వివాహ ప్రయత్నాలు జరుగుతుండగా, భూవివాదం కారణంగా బంధువులతో విభేదాలు తీవ్రస్థాయికి చేరినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. తమకు ప్రాణహాని ఉందని భావించిన లావణ్య తల్లిని ఒంటరిగా ఎక్కడికీ పంపకుండా వెంటనే ఉండేదని సమాచారం.
ఆదివారం ఉదయం తల్లీకుమార్తెలు పామాయిల్ తోటకు వెళ్లగా, కొంతమంది సమీప బంధువులు కూడా వారి వెంట వెళ్లినట్లు స్థానికులు గుర్తించారు. కొద్దిసేపటి తర్వాత వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు తోటలోకి వెళ్లి చూడగా, సుమలత, లావణ్యలు మృతదేహాలుగా కనిపించారు. వారి కళ్లలో కారం చల్లి, చున్నీలతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్తి వివాదాలే ఈ జంట హత్యలకు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
కాగా, లావణ్య రాజేంద్రనగర్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసినట్లు తెలిసింది. కుటుంబ పరిస్థితులు, ప్రాణహాని భయాల కారణంగా ఉద్యోగ ప్రయత్నాలు మానేసి తల్లితో కలిసి వ్యవసాయ పనులు చూసుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Post a Comment