సబ్‌రిజిస్ట్రార్‌పై అక్రమాస్తుల కేసు నమోదు.. భారీగా నగదు, బంగారం స్వాధీనం
హనుమకొండ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ దాడులు నిర్వహించారు. దావులూరి ఆనంద్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు, ఆయన నివాసంతో పాటు బంధువులకు చెందిన పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అవినీతి పద్ధతులు, అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టం 1988 (2018 సవరణ) సెక్షన్ 13(1)(బి) r/w 13(2) కింద కేసు నమోదు చేసినట్లు ACB తెలిపింది.
తనిఖీల్లో ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి:
- రూ.71,56,708 విలువైన రెండు ఇళ్లు
- రూ.28,37,000 విలువైన ఆరు ఓపెన్ ప్లాట్లు
- రూ.24,50,450 నగదు
- రూ.7,05,367 బ్యాంకు నిల్వలు
- రూ.6,07,700 విలువైన గృహోపకరణాలు
- రూ.13,25,000 విలువైన ఒక కారు, రెండు మోటార్ సైకిళ్లు
- 819.500 గ్రాముల బంగారు ఆభరణాలు, 2264.500 గ్రాముల వెండి ఆభరణాలు (విలువ రూ.43,16,930)
ఇప్పటివరకు గుర్తించిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.1,94,01,765గా అధికారులు అంచనా వేశారు. అయితే మార్కెట్ విలువ అధికారిక విలువ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని తెలిపారు. ఇంకా ఇతర ఆస్తులపై విచారణ కొనసాగుతోందని, అక్రమాస్తుల పరిమాణాన్ని పూర్తిగా నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఇక ప్రజా సేవకులు లంచం డిమాండ్ చేసిన సందర్భాల్లో వెంటనే ACB టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలను కోరారు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్/@Telangana ACB ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ACB స్పష్టం చేసింది.

Post a Comment